: ‘చోటా’ కాంట్రాక్టర్ కు ‘బడా’ నేత బెదిరింపులు!...నక్రాల్ చేస్తే లోపలేస్తానంటూ వార్నింగ్
హైదరాబాదు మహా నగరంలో చిన్న చిన్న కాంట్రాక్టు పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న ఓ చిన్న కాంట్రాక్టర్ నిన్న ఓ తెలుగు న్యూస్ ఛానెల్ ను ఆశ్రయించాడు. ఓ చిన్న పనిని నిబంధనల మేరకే దక్కించుకున్న అతడు నెలలు గడిచినా పని పూర్తి చేయలేకపోతున్నాడట. దీనికి కారణం అతడి వద్ద డబ్బు లేకపోవడమో, లేదంటే సరంజామా లేకపోవడమో కాదట. తెలంగాణలో అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత బెదిరింపులేనట. పనిచేసేందుకు వెళ్లిన ప్రతిసారీ సదరు బడా నేత ఆ చిన్న కాంట్రాక్టరుకు అడ్డు తగులుతున్నారట. తాను చెప్పినట్లు పనులు నిలపకపోతే, కట్టిన నిర్మాణాలు కూలగొట్టేందుకు కూడా వెనుకాడబోనని సదరు నేత ఆ కాంట్రాక్టర్ ను బెదిరిస్తున్నారట. ఇక తన మాట వినకపోతే జైల్లో పెట్టిస్తానని కూడా ఆ నేత వార్నింగ్ ఇచ్చారట. వివరాల్లోకి వెళితే.. నగరంలో మోడల్ మార్కెట్ల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఏఎస్ రావు నగర్ పరిధిలోని మార్కెట్ నిర్మాణాన్ని రవీంద్ర సాగర్ అనే చిన్న కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. ఇప్పటికే రూ.9 లక్షలు ఖర్చు పెట్టిన సాగర్, కొంతమేర పనిని కూడా పూర్తి చేశారు. అయితే ఉన్నపళంగా పనిని నిలిపివేయాలని టీఆర్ఎస్ సీనియర్ నేత, ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి హుకుం జారీ చేశారు. తాను పనులు నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేస్తే, పనులెట్టా చేస్తావంటూ వేణుగోపాలాచారి సదరు కాంట్రాక్టర్ ను ఫోన్ లోనే బెదిరించారట. ఈ మేరకు ఫోన్ లో తనను బెదిరించిన వేణుగోపాలాచారి వాయిస్ ను రికార్డు చేసిన సాగర్ సదరు కాపీని టీవీ చానెల్ కు అందజేశారు. ‘‘అవునయ్యా.. వద్దనంగ నువ్వెట్లా కడతవయ్య. నీకేం సంబంధమయ్యా. మేం చెప్పినట్లు కట్టాలి. గవర్నమెంట్ మాది. 10 నెలలు కానీ... 11 నెలలు కానీ.. నువ్ కట్టుకుంటే నేనే గవర్నమెంట్ నుంచి డిఫమేషన్ వేయిస్తా. లేకుంటే రేపే క్యాన్సిల్ చేయిస్తా. నీకు టెండర్ కూడా రాదు. టెండర్ రాకుంటే కోర్టు పో. వద్దనంగ నీకేం షోకయ్యా కట్టేది. కాలనీ వాళ్లు వద్దనంగ నీకేం షోకయ్యా. టెండర్లో పాల్గొన్నావ్. వాళ్లు వద్దన్నరు. వేరే స్థలం చూసేవరకూ ఆగు. గవర్నమెంట్ మా ఇష్టం కదా. కాంట్రాక్టర్ వు కాంట్రాక్టర్ లాగా ఉండు. నక్రాల్ చేస్తావేంటీ? లోపలేయిస్తా బిడ్డా. ఎనిమిది నెలలు అయితే ఏందీ? గవర్నమెంట్ చెప్పింది విను. లేదని కడితే... కూలగొడతం. లేదంటే పరువునష్టం దావా వెయ్. నేను కూడా కోర్టులోనే చూసుకుంటా. మిగతా ఐదు కాంట్రాక్టులు కూడా క్యాన్సిల్ చేయిస్తా. నక్రాల్ చేస్తావేంటీ?’’ అని వేణుగోపాలాచారి ఆ చోటా కాంట్రాక్టర్ పై తన ప్రతాపం చూపారట.