: మరో వివాదంలో పతంజలి సంస్థ... ఈ సారి మురబ్బా...
ప్రముఖ యోగా గురువు, పతంజలి వ్యాపారవేత్త బాబారాందేవ్ మరో వివాదానికి తెరతీశారు. ఏదయినా వస్తువు మార్కెట్ లో విడుదలైతే...ఎప్పుడు విడుదలైందో దానిని తెలియజేసే తేదీని దాని కవర్ పై ముద్రిస్తారు. దీంతో అది ఎప్పుడు తయారైంది? ఎప్పటి వరకు దానిని వాడవచ్చు? అనే వివరాలు తెలుస్తాయి. ఇక్కడే బాబారాందేవ్ సంస్థ పతంజలి తెలివితేటలు ప్రదర్శించి, పట్టుబడింది. పతంజలి సంస్థ తయారు చేసిన కేజీ బరువున్న అలామురబ్బా ప్యాకెట్లను ఉత్తరాఖండ్ లో విడుదల చేసింది. ఈ ప్యాకెట్లను కొనుగోలు చేసిన వినియోగదారులు దీనిని చూసి షాక్ తిన్నారు. కారణం దానిని మార్చిలో కొనుగోలు చేయగా, దానిని 20 అక్టోబర్ 2016లో తయారు చేసినట్టు, 19 అక్టోబర్ 2017లో దాని కాలపరిమితి తీరిపోతున్నట్టు ముద్రించి ఉంది. దీనిని చూసిన వినియోగదారులు నివ్వెరపోయారు. దీంతో ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఏదయినా వస్తువును మార్కెట్ లోకి తీసుకువచ్చే ముందు ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఎస్ డిఏ) అనుమతి తీసుకోవాల్సి ఉంది. అలా దీనికి అనుమతిని ఇచ్చిన ఎఫ్ఎస్ డిఏ కూడా ఈ విషయం గుర్తించకపోవడం విశేషం. అయితే తాము దానిని మార్కెట్ లో విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వలేదని, ఈ అలామురబ్బా క్వాలిటీ టెస్టు కూడా ఫెయిలైందని వారు చెప్పారు. ఇందులో సోంపాపిడి, ఆవుపాలతో చేసిన నెయ్యి, పసుపు లవణం ఉన్నట్టు వెల్లడించింది. ఈ విషయం తెలిసిన ఉత్తరాఖండ్ ఆయుర్వేదిక్ శాఖ కూడా వాటిని బ్యాన్ చేసి, పరీక్షలకు పంపింది. గతంలో మేగీ నాణ్యత పరీక్షల్లో విఫలమైనప్పుడు నీతులు చెప్పిన రాందేవ్ బాబా పతంజలిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.