: ఆ పదివేల కోట్లు రాసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా: జగన్ కు నారాయణ సవాల్
3,169 ఎకరాలు కొనుగోలు చేశానని సాక్షి పత్రిక రాసిన వార్తలపై మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సాక్షి పత్రికలో పేర్కొన్నట్టు 10 వేల కోట్ల రూపాయల విలువైన భూమి తన వద్ద ఉందని నిరూపిస్తే...ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి రాసేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు. అలా నిరూపించలేకపోతే వైఎస్సార్సీపీ అధినేత జగన్ పార్టీ, టీవీ ఛానెల్, వార్తా పత్రికలను మూసేస్తారా? అని సవాలు విసిరారు. ఈ ఛాలెంజ్ కు తాను సిద్ధంగా ఉన్నానని, అసెంబ్లీ సాక్షిగా తాను ప్రకటించిన ప్రకటనకు కట్టుబడి ఉంటానని, జగన్ కు చేతనైతే తన సవాలును స్వీకరించాలని సూచించారు. సాక్షి రాసిన వార్తలపై లీగల్ నోటీసులు పంపామని ఆయన చెప్పారు. చేతిలో పత్రిక, టీవీ ఉన్నాయని చెప్పి, ఏదిపడితే అది ప్రసారం చేస్తే చూస్తూ ఊరుకోలేమని ఆయన హెచ్చరించారు.