: తనదాకా వస్తేగాని... ఢిల్లీ ట్రాఫిక్ జాంపై కదిలిన ఆర్థిక మంత్రి!
ఢిల్లీలో ట్రాఫిక్ జాం చిక్కుల వల్ల ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారన్న విషయం ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీకి తెలిసిపోయింది. ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఢిల్లీ నుంచి గుర్గాన్ వెళ్లే ఎక్స్ ప్రెస్ వేపై చిక్కుకుపోవడంతో సామాన్యుల బాధ ఎలా ఉందన్న సంగతి అర్థమైంది. 'హ్యాపెనింగ్ హర్యానా' పేరిట జరుగుతున్న సదస్సుకు హాజరుకావాల్సిన ఆయన ట్రాఫిక్ జాం కారణంగా అనుకున్న సమయానికి వెళ్లలేకపోయారు. ఆపై ట్రాఫిక్ జాంలపై స్పందిస్తూ, గుర్గాన్ కు కనీసం మరో రెండు లింక్ రోడ్డులను నిర్మించాల్సి వుందని వ్యాఖ్యానించారు. వీటి సాధ్యాసాధ్యాలను వెంటనే పరిశీలిస్తామని, ప్లాన్ సిద్ధమైతే నిధుల మంజారుకు కృషి చేస్తామని అన్నారు. విమానాశ్రయం నుంచి మిలీనియం సిటీగా పేరున్న గుర్గాన్ కు నిత్యమూ వందలాది మంది విదేశీయులు ప్రయాణాలు సాగిస్తుంటారు. ట్రాఫిక్ కష్టాలపై పలుమార్లు ఫిర్యాదులు కూడా అందాయి. కాగా, ఢిల్లీలోని నెల్సన్ మండేలా మార్గ్ నుంచి డీఎల్ఎఫ్ ఫేజ్-3కి ఒకటి, అంధేరియా నుంచి గుర్గాన్, ఫరీదాబాద్ రోడ్ ను కలిపేలా ఒకటి, ద్వారకా, పాలం విహార్ మధ్య మరో లింక్ రోడ్లకు ప్రతిపాదనలు ఉన్నా, ఇంకా ఏ ప్రాజెక్టూ పట్టాలెక్కలేదు.