: యూపీలోనూ బీజేపీకి షాక్!... ‘మండలి’ ఎన్నికల్లో ఖాతా తెరవని వైనం


గడచిన సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోదీ హవాతో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆ తర్వాత పలు రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ నాటి విజయం హవా కొనసాగింది. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీకి జరిగిన ఘోర పరాభవం పరిస్థితిని ఒక్కసారిగా మార్చేసింది. ఇక దేశంలోనే కీలక రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ లో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ప్రీ ఫైనల్స్ గా భావిస్తున్న ఆ రాష్ట్ర శాసన మండలిలో ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని అధికార పార్టీ సమాజ్ వాదీ పార్టీ... బీజేపీకి షాకిచ్చింది. నిన్న వెలుబడిన ఫలితాల్లో మొత్తం 35 స్థానాలకు ఎన్నికలు జరగగా, అధికార సమాజ్ వాదీ పార్టీ ఏకంగా 31 స్థానాలను ఎగరేసుకుపోయింది. ఏడు సీట్లను ఏకగ్రీవంగా చేజిక్కించుకున్న ఎస్పీ, ఎన్నికలు జరిగిన 28 స్థానాల్లో 23 సీట్లలో విజయం సాదించింది. మరో స్థానంలో ఆ పార్టీ మద్దతిచ్చిన స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. ఇక మిగిలిన నాలుగు సీట్లలో రెండింటిలో బీఎస్పీ గెలవగా... ఓ స్థానాన్ని కాంగ్రెస్, మరో స్థానాన్ని స్వతంత్ర అభ్యర్థి చేజిక్కించుకున్నారు. ఇక రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్న బీజేపీకి ఒక్క స్థానం కూడా దక్కకపోవడం గమనార్హం.

  • Loading...

More Telugu News