: పిస్టల్, బుల్లెట్లు పోగొట్టుకున్న వైసీపీ ఎమ్మెల్యే గన్ మన్!
ప్రముఖులకు భద్రత కల్పించే కీలక బాధ్యతల్లో ఉన్న గన్ మన్ల వ్యవస్థ అజాగ్రత్తకు ఈ ఘటన పరాకాష్ఠ. ఎమ్మెల్యేగా ఉన్న ఓ నేత భద్రతా విధుల్లో ఉన్న ఓ గన్ మన్ ప్రయాణంలో తన పిస్టల్ తో పాటు పది బుల్లెట్లను పోగొట్టుకున్నాడు. బస్సెక్కి ఒళ్లు తెలియకుండా నిద్రపోయిన సదరు గన్ మన్... లేచి చూసుకునేసరికి జేబులో ఉండాల్సిన పిస్టల్, బుల్లెట్లు కనిపించకపోవడంతో బెంబేలెత్తిపోయాడు. అయితే చేసేదేమీ లేక బస్సు దిగి హైదరాబాదులోని అప్జల్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. వివరాల్లోకెళితే వైసీపీ సీనియర్ నేత, చిత్తూరు జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథ్ రెడ్డి హైదరాబాదులో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు మొన్న తిరుపతి నుంచి విమానంలో హైదరాబాదుకు బయలుదేరారు. ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పటి నుంచి ఆయనకు చిత్తూరు ఏఆర్ విభాగానికి చెందిన గౌస్ సాహెబ్ గన్ మన్ గా వ్యవహరిస్తున్నాడు. ఎమ్మెల్యే విమానంలో బయలుదేరగా, గౌస్ మాత్రం శనివారం రాత్రి బస్సులో హైదరాబాదు బయలుదేరాడు. పలమనేరులోనే హైదరాబాదు బస్సెక్కిన సాహెబ్... బస్సు ఎక్కీ ఎక్కగానే నిద్రలోకి జారుకున్నాడు. నిద్ర మత్తులోనే సాహెబ్ తాను కూర్చున్న సీటు నుంచి మరో సీటుకు మారాడు. సీటు మారుతున్న క్రమంలో అతడు తన పిస్టల్, బుల్లెట్లను చూసుకోలేదు. అయితే నిన్న తెల్లారి హైదరాబాదు చేరుకున్న తర్వాత నిద్ర లేచిన సాహెబ్ జేబు తడుముకుని షాకయ్యాడు. జేబులో ఉండాల్సిన పిస్టల్, 10 బుల్లెట్లు అతడి వద్ద కనిపించలేదు. దీంతో ఆందోళనకు గురైన సాహెబ్ బస్సు మొత్తం వెతికాడు. అయినా ప్రయోజనం లేకపోయింది. దీంతో బస్సు దిగి అఫ్జల్ గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చిత్తూరులోని తన పై అధికారులకు కూడా అతడు సమాచారాన్ని చేరవేశాడు. ఈ ఘటనపై చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీనివాస్ సమగ్ర విచారణకు ఆదేశాలు జారీ చేశారు.