: కార్ల ధరలు పెరిగే కాలం... సుజుకి, హ్యుందాయ్ బాటలోనే నిస్సాన్!
బడ్జెట్-2016 తరువాత కార్ల ధరలకు రెక్కలొచ్చిన సంగతి తెలిసిందే. 4 మీటర్ల కన్నా పొడవుండే డీజిల్ వాహనాలపై (ఇంజన్ సామర్థ్యం 1500 సీసీలోపు) అదనంగా 2.5 శాతం పన్నును, మరింత సామర్థ్యమున్న వాహనాలపై 4 శాతం అదనపు పన్నును విధిస్తున్నట్టు ఆర్థికమంత్రి జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పలు వాహన కంపెనీలన్నీ కార్ల ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. జపాన్ కేంద్రంగా పనిచేస్తూ, ఇండియాలో పలు మోడల్స్ లో వాహనాలను విక్రయిస్తున్న నిస్సాన్ సంస్థ తమ కార్ల ధరలను 4 శాతం వరకూ పెంచుతున్నట్టు ప్రకటించింది. డాట్సన్, టెర్రానో, సన్నీ తదితర మోడల్స్ ధరలను 1 నుంచి 3.5 శాతం పెంచామని సంస్థ ప్రతినిధి ఒకరు వివరించారు. పెంచిన ధరల తరువాత ఎంట్రీ లెవల్ స్మాల్ కారు డాట్సన్ గో రూ. 3.23 లక్షలకు, డాట్సన్ గో ప్లస్ ధర రూ. 4.78 లక్షలకు (ఎక్స్ షోరూం, ఢిల్లీ) పెరగనుంది. కాగా, గత వారంలో హ్యుందాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతి సుజుకి, హోండా తదితర కార్ల ధరలు రూ. 82 వేల వరకూ పెరిగిన సంగతి తెలిసిందే. మెర్సిడిస్ బెంజ్, టాటా మోటార్స్ సైతం నేడో రేపో ధరలను పెంచనున్నట్టు తెలుస్తోంది.