: మరింతగా పెరగనున్న బంగారం ధర!
ఇప్పటికే రూ. 30 వేలకు చేరువైన పది గ్రాముల బంగారం ధర మరింతగా పెరగనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. డాలర్ బలపడుతుండటం, ఇండియాలో కొనసాగుతున్న వివాహాది శుభముహూర్తాల సీజన్, తదుపరి పరపతి సమీక్షలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లు పెంపు జోలికి పోబోదని వస్తున్న వార్తలు ధరల పెరుగుదలకు కారణమయ్యాయి. ప్రస్తుతం ముంబై జవేరీ బజారులో బంగారం ధర 22 నెలల గరిష్ఠస్థాయిలో కొనసాగుతోంది. మొత్తం మీద ఈ సంవత్సరం జనవరి నుంచి ఇప్పటివరకూ బంగారం ధర 17 శాతం పెరిగింది. గత వారంలో 0.76 శాతం పెరిగి రూ. 29,300కు చేరింది. ఆర్థిక మార్కెట్లు ఒడిదుడుకుల్లో సాగుతున్న వేళ బంగారంలో పెట్టుబడి అత్యంత సురక్షితమని ఇన్వెస్టర్లు భావిస్తుండటం కూడా బులియన్ మార్కెట్ కు లాభిస్తోందని ట్రేడర్లు వ్యాఖ్యానించారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో గత వారాంతంలో 1,274 డాలర్లను తాకిన ఔన్సు బంగారం ధర, ఆపై లాభాల స్వీకరణతో స్వల్పంగా తగ్గి 1,259 డాలర్లకు చేరింది. సమీప భవిష్యత్తులో ఈ ధర 1,300 డాలర్లను తాకవచ్చని న్యూయార్క్ మర్కంటైల్ ఎక్స్ఛేంజ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదే జరిగితే దేశవాళీ మార్కెట్లో 10 గ్రాముల బంగారం ధర రూ. 32 వేలను దాటవచ్చు.