: ప్రత్యర్థుల గెలుపుతో చిక్కుల్లో ట్రంప్, హిల్లరీ!
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ల తరఫున బరిలోకి దిగుతారని భావిస్తున్న డొనాల్డ్ ట్రంప్, డెమొక్రాట్ల తరఫున పోటీ పడతారని భావిస్తున్న హిల్లరీలకు తాజా ఎన్నికల్లో చుక్కెదురైంది. రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగగా, ప్రత్యర్థుల చేతుల్లో వీరిద్దరూ ఓడిపోయారు. కన్సాస్, మైనీ కాకుసెస్ రాష్ట్రాల్లో ట్రంప్ పై టెక్సాస్ సెనెటర్ టెడ్ క్రూజ్ సునాయాస విజయం సాధించారు. ఇదే సమయంలో కన్సాస్, నెబ్రాస్కా రాష్ట్రాల్లో హిల్లరీ క్లింటన్ పై శాండర్స్ విజయం సాధించారు. లూసియానాలో మాత్రం ఆమె గట్టెక్కగలిగారు. తాను జీవితాంతం పోటీ పడుతూనే వస్తున్నానని, టెడ్ పై ఎన్నోమార్లు తాను విజయం సాధించానని, ఈ ఓటమి తనపై ప్రభావం చూపబోదని ట్రంప్ వ్యాఖ్యానించారు. కాగా, మిగతా రాష్ట్రాల్లో రిపబ్లికన్ల తరఫున బరిలో ఉన్న వారు వైదొలగితే, తాను ట్రంప్ ను సునాయాసంగా ఓడించగలనని టెడ్ క్రూజ్ వ్యాఖ్యానించారు.