: రావెల సుశీల్ కు పోలీసు నోటీసులు... ఇంటికెళ్లి మరీ అందజేసిన వైనం
మద్యం మత్తులో మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ మంత్రి రావెల కిశోర్ బాబు తనయుడు రావెల సుశీల్ కు హైదరాబాదు, బంజారాహిల్స్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. 41 సీఆర్పీసీ కింద అతడికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న మధ్యాహ్నం ఘటన చోటుచేసుకోగా, నిన్న సాయంత్రమే దీనిపై సుశీల్ కారు డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తనపై జరిగిన వేధింపుల పర్వాన్ని బాధిత మహిళ పూసగుచ్చినట్లు వివరించడమే కాకుండా సుశీల్ పై కఠిన చర్యలు తీసుకోకుంటే పోలీస్ స్టేషన్ ముందే ఆందోళనకు దిగుతామంటూ హెచ్చరించడంతో పోలీసులు కదలక తప్పలేదు. నేటి ఉదయం జూబ్లీ హిల్స్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని రావెల ఇంటికి వెళ్లిన పోలీసులు సుశీల్ కు నోటీసులు అందజేశారు.