: ‘ఎర్రబెల్లి అండ్ కో’కు నోటీసులు!...‘జంపింగ్’పై వారంలోగా వివరణ ఇవ్వాలన్న స్పీకర్
తెలంగాణలో ‘జంపింగ్’లపై ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి నిన్న కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల టీడీపీ నుంచి అధికార టీఆర్ఎస్ లోకి చేరిన ఐదుగురు ఎమ్మెల్యేలకు ఆయన నోటీసులు జారీ చేశారు. పార్టీ మారిన వైనంపై వారంలోగా వివరణ ఇవ్వాలని స్పీకర్ సదరు నోటీసుల్లో ‘జిలానీ’లకు ఆదేశాలు జారీ చేశారు. నోటీసులు జారీ అయినవారిలో అప్పటిదాకా టీ టీడీఎల్పీ నేతగా ఉన్న ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు టీడీపీ ఎమ్మెల్యేలు ప్రకాశ్ గౌడ్, వివేకానంద గౌడ్, సాయన్న, రాజేందర్ రెడ్డి ఉన్నారు. పార్టీ ఫిరాయించిన వీరిపై అనర్హత వేటు వేయాలని టీ టీడీపీ స్పీకర్ కు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదులపై స్పందించిన మేరకే స్పీకర్ ‘ఎర్రబెల్లి అండ్ కో’కు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 10 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ‘జంప్ జిలానీ’లకు నోటీసులు జారీ చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ నోటీసులకు ‘ఎర్రబెల్లి అండ్ కో’ ఏవిధంగా స్పందిస్తుంది? స్పీకర్ ఏ విధంగా వ్యవహరిస్తారు? అన్న అంశాలపై ఆసక్తి నెలకొంది.