: కేన్సర్ పై సరికొత్త పోరాటం... ఇమ్యూనిటీ వ్యాక్సిన్ తో ప్రయోగం!


ప్రాణాలను హరించే మహమ్మారి కేన్సర్ ను సమర్థంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ తయారీ కోసం జరుగుతున్న పరిశోధనల్లో పురోగతి కనిపిస్తోంది. సాధారణంగా మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి బయటి నుంచి వచ్చే పలు వ్యాధులను అడ్డుకుంటుంది. తద్వారా మన శరీరాన్ని రోగాల బారిన పడకుండా కాపాడుతుంది. అయితే, కేన్సర్ సోకిన వ్యక్తిలో మాత్రం రోగనిరోధక శక్తి క్రమేణా క్షీణిస్తుంది. సాధారణంగా మానవ శరీరంలోని కణాలు కొంత కాలానికి నశిస్తుంటాయి. కేన్సర్ కణాలు అలా కాదు. ఇవి నశించడం సంగతి పక్కన పెడితే, మరింతగా పుట్టుకొస్తుంటాయి. దీంతో కేన్సర్ సోకిన భాగం నుంచి అది ఇతర భాగాలకు విస్తరించి, చివరికి మనిషి ప్రాణాలను బలితీసుకుంటాయి. ఇక్కడే లండన్ కు చెందిన పరిశోధకులు దృష్టి పెట్టారు. కేన్సర్ కణాలను తట్టుకునేలా రోగ నిరోధక శక్తిని పెంపొందింపజేసే వ్యాక్సిన్ ను తయారుచేశారు. పైగా, కేన్సర్ ముదిరిన రోగులలో ప్రభావం చూపేలా ఈ వ్యాక్సిన్ ను డిజైన్ చేశారు. సహజ సిద్ధమైన రోగనిరోధక శక్తిలా ఇది పనిచేస్తూ, కేన్సర్ కణాలపై పోరాడుతుంది. అందుకే, దీని ప్రయోగానికి కెల్లీ పోటర్ (35) అనే కేన్సర్ బాధితురాలిని తాజాగా ఎంచుకున్నారు. ఆమెను ఎంచుకోవడానికి కూడా ప్రత్యేకమైన కారణముంది. 2015 జూలైలో ఆమెకు గర్భాశయ కేన్సర్ సోకింది. అప్పటికే కేన్సర్ నాలుగో దశలో ఉందని, పరిస్థితి చేయిదాటిపోయిందని చెప్పిన 'గయ్స్ ఆసుపత్రి' వైద్యులు ఆమెకు చికిత్స మొదలెట్టారు. అయితే, వేగంగా కాలేయానికి, ఊపిరితిత్తులకు కూడా కేన్సర్ పాకిపోయింది. ఆమె సహకరిస్తానని ముందుకు రావడంతో, ఇప్పుడు ఆమెపై ఈ వ్యాక్సిన్ ను ప్రయోగిస్తున్నారు. ఫిబ్రవరి 9న ఆమెకు ఈ వ్యాక్సిన్ ఇచ్చారు. ఇది తీసుకున్న తరువాత ఆమెకు ఫ్లూ లాంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉందని ముందుగానే చెప్పారు. అయితే ఆమెకు ఎలాంటి లక్షణాలు కనిపించకపోవడం విశేషం. ఈ సందర్భంగా ఈ పరిశోధక బృంద సభ్యుడు ప్రొఫెసర్ హర్ దేవ్ పాండా మాట్లాడుతూ, "కేన్సర్ రోగుల్లో ఇమ్యూనిటీ (రోగనిరోధకశక్తి) దారుణంగా దెబ్బతింటుంది. అందుకే, దానిని సాధారణ స్థితికి తీసుకువచ్చి, ఇమ్యూనిటీ పుంజుకునేలా వ్యాక్సిన్ రూపొందించాం. మా ప్రయత్నం విజయవంతమైతే కేన్సర్ పై పోరాటంలో చాలావరకు విజయం సాధించిన వాళ్లం అవుతాం" అన్నారు. ట్రీట్మెంట్ తీసుకుంటున్న కెల్లీ మాత్రం ఈ వ్యాక్సిన్ పట్ల చాలా సానుకూల దృక్పథంతో వుంది. తానెలాగూ కేన్సర్ చివరి దశలో వున్నాను కాబట్టి, ఈ ప్రయోగానికి ముందుకు వచ్చానని చెప్పింది. ఇది విజయం సాధిస్తే కేన్సర్ ట్రీట్మెంట్ లో ఇదొక విప్లవం అవుతుందని అంటోంది.

  • Loading...

More Telugu News