: రోజా వ్యాఖ్యలను తిప్పికొట్టిన బోండా ఉమా మహేశ్వరరరావు
నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతిలో టీడీపీ నేత భూదందాపై ‘సాక్షి’ పత్రిక నిన్న ప్రచురించిన కథనం ఏపీలో రాజకీయ వేడిని పుట్టించింది. నిన్నటి నుంచి వైసీపీ విమర్శలు, టీడీపీ ప్రతి విమర్శలు... వెంటవెంటనే మీడియా సమావేశాలతో ఒక్కసారిగా వాతావరణం హీటెక్కింది. తాజాగా నేటి ఉదయం హైదరాబాదు లోటస్ పాండ్ లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ ఫైర్ బ్రాండ్ ఆర్కే రోజా టీడీపీపై విరుచుకుపడ్డారు. రోజా మీడియా సమావేశం ముగియకముందే అటు విజయవాడలో టీడీపీ ఎమ్యెల్యే బోండా ఉమా మహేశ్వరరరావు మీడియా ముందుకు వచ్చారు. రోజా చేసిన వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఐరన్ లెగ్ గా పరిణమించిన రోజా విలువల గురించి మాట్లాడటం హాస్యాస్పదమని ఆయన విమర్శించారు. వైసీపీ డిమాండ్ చేసినట్లుగా ప్రతి అంశంపై విచారణలు వేసుకుంటూ పోతే, రోజుకో విచారణ కమిటీని వేయాల్సి వస్తుందని ఆయన ఆరోపించారు. అయినా రాజధాని భూదందాపై వైసీపీ వద్ద ఏమైనా ఆధారాలుంటే వాటిపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేస్తామని బోండా ప్రకటించారు.