: కివీస్ క్రికెట్ లెజెండ్ మార్టిన్ క్రో ఇక లేరు... కేన్సర్ తో పోరులో ఓడిన దిగ్గజం
న్యూజిల్యాండ్ క్రికెట్ దిగ్గజం మార్టన్ క్రో (53) ఇక లేరు. ప్రాణాంతక వ్యాధి కేన్సర్ తో సుధీర్ఘ కాలంగా కొనసాగిస్తున్న పోరులో ఆయన ఓడిపోయారు. నేటి ఉదయం న్యూజిల్యాండ్ రాజధాని వెల్లింగ్టన్ లో తుదిశ్వాస విడిచారు. కివీస్ జట్టు తరఫున 13 ఏళ్ల పాటు సుధీర్ఘ ప్రస్థానం సాగించిన మార్టన్ క్రో... ప్రస్తుతం బహుళ ప్రజాదరణ పొందిన టీ20 ఫార్మాట్ మ్యాచ్ లు కూడా ఆడాడు. హాలీవుడ్ స్టార్ రస్సెల్ క్రో సోదరుడిగా ప్రచారంలోకి వచ్చిన మార్టిన్ క్రో తనదైన శైలిలో బ్యాటు ఝుళిపించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. 1962 సెప్టెంబర్ 22న ఆక్లాండ్ లో జన్మించిన మార్టన్ క్రో.. 1982లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ తో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు. కివీస్ తరఫున మొత్తం 77 టెస్టులు ఆడిన క్రో, 143 వన్డే మ్యాచ్ లు కూడా ఆడాడు. టెస్టుల్లో 45.36 సగటుతో మొత్తం 5,444 పరుగులు చేసిన క్రో... ఓ మ్యాచ్ లో 299 పరుగులు చేసి ట్రిపుల్ సెంచరీకి అడుగు దూరంలో ఔటయ్యాడు. వన్డేల్లోనూ 38.55 సగటుతో 4,704 పరుగులు చేశాడు. మోకాలి గాయంతో 1995లో స్వల్ప విశ్రాంతి తీసుకున్న ఆయన ఇక మళ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో ఆడలేదు.