: ముద్రగడ తీరుపై చంద్రబాబు అభ్యంతరం!
కాపు నేత ముద్రగడ పద్మనాభం తీరుపై సీఎం చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. విజయవాడలో కొద్ది సేపటి క్రితం మంత్రులతో బాబు భేటీ ముగిసింది. కాపు రిజర్వేషన్లు, ముద్రగడ లేఖ, టీడీపీ నేతలపై వైఎస్సార్సీపీ అధినేత జగన్ చేసిన భూ ఆరోపణలపై ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. ఈ సందర్భంగానే ముద్రగడ తీరుపై బాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. కాపు రిజర్వేషన్లకు సంబంధించి తానిచ్చిన గడువు పూర్తి కాకుండానే, మళ్లీ డెడ్ లైన్ పెట్టడమేంటని బాబు ప్రశ్నించినట్లుగా తెలుస్తోంది. జగన్ కోసమే ముద్రగడ లేఖ రాస్తున్నట్లుగా ఉందని, అందులో ఆయన వాడిన భాష ఏమాత్రం హుందాగా లేదని మంత్రులతో బాబు అన్నట్లు సమాచారం. కాపుల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ప్రభుత్వాన్ని ముద్రగడ డిక్టేట్ చేయలేరని ఆ సమావేశంలో బాబు పేర్కొన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.