: జైషే మహమ్మద్ నేత మసూద్ ను విచారించే అవకాశమిస్తాం: భారత్ కు పాక్ ఆఫర్
పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రదాడికి సూత్రధారిగా భారత్ ఆరోపిస్తున్న జైషే మహమ్మద్ నేత మసూద్ అజర్ ను విచారించేందుకు భారత అధికారులకు అవకాశమిస్తామని పాకిస్థాన్ ప్రకటించింది. అయితే, అంతకుముందుగా తాము అతన్ని విచారిస్తామని, అతను నిందితుడని తేలితే, భారత దర్యాఫ్తు బృందాలు ప్రశ్నించవచ్చని పాక్ ప్రధానమంత్రి విదేశీ వ్యవహారాల సలహాదారు సత్రాజ్ అజీజ్ తెలిపారు. రక్షణ రంగ అధికారులతో సమావేశమైన ఆయన అనంతరం మాట్లాడుతూ, "ముందు మాకు మేం నిజం తెలుసుకుంటాం. అతని ప్రమేయం ఏదైనా ఉందని తేలితే చర్యలు తప్పవు" అన్నారు. "ఇప్పటికే పఠాన్ కోట్ దాడిపై విచారణకు మా వంతు సహకారం చేస్తున్నాం. ప్రధాని నవాజ్ షరీఫ్ సైతం ఘటన జరిగిన వెంటనే భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి సహకరించేందుకు సిద్ధమని చెప్పారు" అని సత్రాజ్ గుర్తు చేశారు.