: భవనం పై నుంచి కిందపడి మహిళా టెక్కీ మృతి... ఘటనపై అనుమానాలు
హైదరాబాదులో నేటి ఉదయం మరో మహిళా టెక్కి అనుమానాస్పద స్థితిలో మరణించింది. గచ్చిబౌలిలోని ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో పనిచేస్తున్న రాణి మిశ్రా అనే ఉద్యోగిని ఇందిరానగర్ పరిధిలో తానుంటున్న హాస్టల్ భవనంపై నుంచి కింద పడిపోయింది. ఈ క్రమంలో బలమైన గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. జార్ఖండ్ కు చెందిన రాణి మిశ్రా ఉద్యోగం నిమిత్తం హైదరాబాదులో ఉంటోంది. ఈ ఘటనపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాణి మిశ్రా ఆత్మహత్య చేసుకుందా? లేక ఎవరైనా ఆమెను భవనంపై నుంచి తోసేశారా? అన్న విషయం తెలియరాలేదు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.