: ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను...511 కోట్లు చెల్లించాల్సిందే: అమెరికా టీవీ యాంకర్
2008లో వాండర్ బిల్ట్ ఫుట్ బాల్ క్రీడలను కవర్ చేసేందుకు వెళ్లిన ఈరిన్ ఆండ్ర్సూ, 'వాండర్ బిల్ట్ యూనివర్సిటీ' సమీపంలో ఉన్న మారియట్ నేష్ విల్లే హోటల్ లో బస చేశారు. ఈ సందర్భంగా ఆమె రూం పక్కనే బస చేసిన మైఖేల్ డేవిడ్ బారెట్ అనే వ్యక్తి గోడకు రంధ్రం చేసి, ఆమె బాత్రూం దృశ్యాలను వీడియో తీసి ఇంటర్నెట్ లో పెట్టాడు. అప్పటికే 'డాన్సింగ్ విత్ స్టార్స్' కార్యక్రమం ద్వారా పాప్యులర్ అయిన ఆండ్ర్సూ, దీని కారణంగా బాగా అప్సెట్ అయింది. మారియట్ నేష్ విల్లే హోటల్ పై 71 మిలియన్ డాలర్ల (511 కోట్ల రూపాయలు)కు ఆమె కోర్టులో పరువు నష్టం దావావేశారు. ఈ కేసు విచారణలో జ్యూరీ ముందు హాజరైన ఆమె ఆ సంఘటన సందర్భంగా ఎంతో మానసిక ఆందోళన అనుభవించానని, ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, ఎంత అవమాన భారంతో కుంగిపోయానో, రోదించానో తనకే తెలియదని వివరించారు. ఈ విషయంపై విచారణ వెలుగు చూడకముందే, ఆ వీడియోలు తానే విడుదల చేశానని చెబుతూ మరోపక్క మీడియా కథనాలు ప్రసారం చేసిందని, దీంతో తన వేదన మరింత అధికమైందని ఆమె జ్యూరీకి తెలిపారు. తన గది నెంబర్ వెల్లడించడం వల్లే దుండగుడు ఈ పనికి పాల్పడ్డాడని, తన గది పక్కనే రూం కావాలంటూ ఓ వ్యక్తి అడిగినట్టు హోటల్ సిబ్బంది చెప్పి ఉంటే తాను ఆ రోజే పోలీసులకు ఫిర్యాదు చేసేదానినని, ఈ ఘటన జరిగి ఉండేది కాదని ఆమె జ్యూరీకి తెలిపారు. అయితే, హోటల్ యాజమాన్యం మాత్రం దీంతో విభేదించింది. ఈ ఘటనలో హోటల్ తప్పు లేదని, ఎవరో చేసిన పనికి హోటల్ ను నిందించడం సరికాదని, ఈ ఘటనలో తప్పంతా డేవిడ్ బారెట్ దేనని హోటల్ తరపు లాయర్ జ్యూరీకి తెలిపారు. అయితే, దీనిపై న్యాయస్థానం తీర్పు వెలువరించాల్సి ఉంది.