: కొత్త పీఎఫ్ పన్నుపై కేంద్రం వెనుకడుగు... తొలగించే అవకాశం!


చిన్న, మధ్య తరగతి ఉద్యోగులు నెలనెలా తమ వేతనం నుంచి కోత విధించుకుని మరీ, భవిష్యత్తు కోసం దాచుకునే పీఎఫ్ ఖాతాల నుంచి డబ్బు విత్ డ్రా చేసుకుంటే పన్ను వేయాలన్న బడ్జెట్ ప్రతిపాదనను ఆర్ధిక మంత్రి జైట్లీ వెనక్కు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. నిన్నటి బడ్జెట్ ప్రసంగం తరువాత ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ చందాదారులు ఆందోళన చెందిన సంగతి తెలిసిందే. పీఎఫ్ ఖాతాల్లోని 60 శాతం నిధుల విత్ డ్రాపై పన్ను విధించనున్నట్టు జైట్లీ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి పీఎఫ్ డబ్బు వెనక్కు తీసుకుంటే ఆ మొత్తంలో 60 శాతంపై పన్ను చెల్లించాలని చెప్పారు. ఇండియాలో దాదాపు 6.5 కోట్ల మంది ఈపీఎఫ్ ఖాతాదారులు ఉండగా, వారంతా జైట్లీ ప్రతిపాదనపై నిరసన వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని నేడు ప్రస్తావించిన ఆర్థిక శాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, ఉద్యోగుల ఆందోళనను తాము గుర్తించినట్టు తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. దీనిపై సందేహాలను తీరుస్తామని అన్నారు. కాగా, మూలధనానికి మినహాయింపు ఉంటుందని, వచ్చిన వడ్డీపై మాత్రమే పన్ను చెల్లించాలని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అదియా వివరించారు. కాగా, బడ్జెట్ ఆమోదంలోగా, ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవచ్చని సమాచారం.

  • Loading...

More Telugu News