: మమ్మల్ని దెబ్బతీసింది పిచ్: షోయబ్ మాలిక్
ఆసియా కప్ లో భారత్ పై ఓటమి పాకిస్థాన్ అభిమానులను ఆగ్రహానికి గురి చేసింది. దానిని చల్లార్చేందుకు పాకిస్థాన్ ఆటగాళ్లు తంటాలు పడుతున్నారు. గతంలో ఓటమి బాధించిందని, అయితే తమ పోరాటం ముగియలేదని వారు స్పష్టం చేయగా, తాజాగా ఈ ఓటమిపై సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ స్పందించాడు. భారత్ తో మ్యాచ్ లో పిచ్ పై సరైన అవగాహన లేకపోవడం ఓటమికి కారణమని అన్నాడు. కొంత మంది పేలవ షాట్లతో వికెట్లు చేజార్చుకోగా, ఖుర్రం, అఫ్రిదీ వంటి కీలక ఆటగాళ్లు రనౌట్ కావడం కూడా జట్టు ఓటమికి కారణమని షోయబ్ పేర్కొన్నాడు. భావోద్వేగంతో కూడుకున్న మ్యాచ్ లో ఓటమిపాలవ్వడం నిరాశ కలిగించిందని చెప్పిన షోయబ్ మాలిక్, టోర్నీ ఇంకా ముగియలేదని, మిగిలిన మ్యాచుల్లో సత్తా చాటుతామని అన్నాడు. కాగా, నేడు యూఏఈతో పాకిస్థాన్ తలపడనున్న సంగతి తెలిసిందే.