: యానాంలో... సీఎం రంగసామితో ఎమ్మెల్యే మల్లాడి వాగ్వాదం
పుదుచ్చేరి ముఖ్యమంత్రి రంగసామితో యానాం ఎమ్మెల్యే మల్లాడి కృష్ణారావు వాగ్వాదానికి దిగిన ఘటన యానాంలో చోటుచేసుకుంది. ఎన్నికల సందర్భంగా పుదుచ్చేరి ప్రజలందరికీ మిక్సీలు, గ్రైండర్లు అందజేస్తానని ఇచ్చిన హామీని నెరవేర్చేందుకు ఆల్ ఇండియా నమదురాజ్యం పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి ఎన్.రంగసామి యానాంలోని జీహెచ్ఎంసీ బాలయోగి స్టేడియంకు వచ్చారు. ఆయన వేదిక ఎక్కగానే ఆయన మద్దతుదారులు, అనుచరులు పెద్ద సంఖ్యలో వేదికపైకి దూసుకువచ్చారు. దీంతో మల్లాడి ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్దతుదారులు, అనుచరులు వేదిక దిగాలని సూచించారు. దీనికి వారు నిరాకరించడంతో సీఎంతో ఎమ్మెల్యే వాగ్వాదానికి దిగారు. దీంతో మల్లాడి కృష్ణారావు అనుచరులు పెద్ద ఎత్తున వేదికపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి చేయిదాటిపోతుందని గమనించిన సీఎం ముగ్గురు ప్రధాన అనుచరులు మినహా, మిగిలిన అందర్నీ కిందికి దిగాలని సూచించారు. దీంతో మల్లాడి అనుచరులను ఆయన శాంతించమని సూచించారు. దీంతో అక్కడ వాతావరణం చల్లబడింది. అనంతరం ఆయన మిక్సీలు, గ్రైండర్లు పంపిణీ పూర్తిచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎన్నికల హామీ మేరకు 120 కోట్ల రూపాయలను ఖర్చు చేసి అన్ని కుటుంబాలకు మిక్సీ, గ్రైండర్లు పంపిణీ పూర్తి చేశామని అన్నారు. 29 నియోజకవర్గాలను సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. యానాం అభివృద్ధికి మల్లాడి చేసిన సూచనలను అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.