: జగన్ గురించి రాహుల్ గాంధీ నాతో మాట్లాడారు!: జేసీ
'గురువారం ఉదయం మా వాడిని (జగన్ ను) పార్లమెంటు 4వ గేటు వద్ద కలిశా'నని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. విజయవాడలో సీఎం సమావేశం ముగిసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, మావాడితో రాజకీయాలు ఏమీ మాట్లాడలేదని, 'బాగున్నావా అంటే బాగున్నావా' అని పలకరించుకున్నామని ఆయన చెప్పారు. అనంతరం ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీని కలిశానని ఆయన చెప్పారు. అయితే రాష్ట్ర విభజన పట్ల ఆమెలో ఎలాంటి పశ్చాత్తాపభావం కనపడలేదని ఆయన వెల్లడించారు. ఆ తరువాత ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో మాట్లాడినప్పుడు రాష్ట్ర విభజనపై పశ్చాత్తాపం వ్యక్తం చేశాడని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. ఆ తరువాత రాహుల్ తనతో జగన్ గురించి మాట్లాడారని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా రాహుల్ లో జగన్ పై సదాభిప్రాయం ఉన్నట్టు కనపడలేదని అన్నారు. అలాగే జగన్ కు శిక్ష తప్పదని కూడా ఆయన చెప్పారని జేసీ పేర్కొన్నారు. ఇక, వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి ఎమ్మెల్యేలు ప్రవాహంలా వస్తారని ఆయన చెప్పారు. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు టీడీపీ నేతలతో టచ్ లో ఉన్నారని ఆయన అన్నారు. త్వరలోనే ఆ పార్టీ ఖాళీ అవుతుందని ఆయన చెప్పారు.