: భారత్ - పాక్ టీ-20లో ఆసక్తికర విశేషాలు!
గత రాత్రి జరిగిన ఆసియా కప్ టీ-20లో పాకిస్థాన్ ను భారత్ చిత్తు చేసిన సంగతి తెలిసిందే. బౌలర్ల స్వర్గధామమైన పిచ్ పై జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్ గురించిన ఆసక్తికర విశేషాలివి. * తొలి పది ఓవర్లలోపే ప్రత్యర్థి జట్టు 6 వికెట్లను దొరకబుచ్చుకోవడం భారత్ కు ఇది రెండోసారి. వైజాగులో శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లోనూ ఈ ఫీట్ నమోదైంది. * పవర్ ప్లే సమయంలో నెహ్రా కనీసం ఒక్క వికెట్ ను దక్కించుకోవడం ఇది వరుసగా ఆరోసారి. * పాకిస్థాన్ తో మొత్తం ఆరు టీ-20 పోటీలు జరుగగా, భారత్ 4 మ్యాచ్ ల్లో, పాక్ 1 మ్యాచ్ లో గెలిచాయి. మరో మ్యాచ్ టై అయింది. * పవర్ ప్లేలో భారత్ స్కోరు 21 పరుగులు. ఇండియాకు సంబంధించినంత వరకూ ఇదే అతి తక్కువ స్కోరు. గతంలో 2010 వరల్డ్ టీ-20లో భాగంగా ఆస్ట్రేలియాపై భారత్ 4 వికెట్లు కోల్పోయి 24 పరుగులు చేసింది. * భారత ఓపెనర్లిద్దరూ డక్కౌట్ కావడం ఇదే ప్రథమం. * టీ-20ల్లో పాకిస్థాన్ కు ఇది మూడో అతి తక్కువ స్కోరు. గతంలో ఆస్ట్రేలియాపై 74, వెస్టిండీస్ పై 82 పరుగుల లో స్కోర్ కు పాక్ ఆలౌటైంది.