: తాగునీటి సంఘాలకు రూ.11వేల కోట్లు ఖర్చు చేశాం: మంత్రి ఉమ
అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో రాష్ట్రంలో తాగునీటి సంఘాలకు రూ.11వేల కోట్లు ఖర్చు చేసినట్టు ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో భేటీ తరువాత మంత్రి మీడియాతో మాట్లాడారు. పోలవరం ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన నిధులను విడుదల చేయాలని కోరామన్నారు. ఇప్పటివరకు పోలవరానికి రూ.2,300 కోట్లు ఖర్చు చేస్తే, కేంద్రం రూ.300 కోట్లు ఇచ్చిందని తెలిపారు. కాబట్టి పోలవరం ప్రాజెక్టుకు బడ్జెట్ లో నిధులు కేటాయించాలని ప్రధానిని, మంత్రి ఉమాభారతిని సీఎం చంద్రబాబు కోరారని చెప్పారు. పోలవరానికి మరోవారంలో అమెరికా, జర్మనీ నుంచి యంత్రాలు రానున్నాయని వెల్లడించారు. రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తామని, హంద్రీనీవా మొదటి విడత ఈ ఏడాదికల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అంతేగాక నిర్ణీత గడువులోగా ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు.