: కులాల కుంపటిలా పత్తికోళ్ల లంక... చేపల చెరువులపై మరోమారు వివాదం, ఉద్రిక్తత
చేపల చెరువుల వివాదంతో రావణకాష్టంలా మారిన పత్తికోళ్ల లంకలో మరోమారు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మండలం పరిధిలోని ఈ గ్రామంలో ఇటీవల రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వ్యక్తి చనిపోగా, పలువురికి గాయాలయ్యాయి. చేపల చెరువుల ఆదాయంపై నాడు గొడవ జరగగా, తాజాగా వంద ఎకరాలకు పైగా విస్తరించి ఉన్న ఈ చెరువుల్లో చేపలు పట్టే విషయంపై మరోమారు వివాదం రాజుకుంది. తమ వాటా తేల్చిన తర్వాతే చేపలు పట్టే కార్యక్రమాన్ని ప్రారంభించాలని గ్రామంలోని దళితులు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామం కులాల వారీగా చీలిపోయింది. పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఈ క్రమంలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి అక్కడ నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు గతానుభవాల దృష్ట్యా హుటాహుటీన గ్రామానికి బలగాలను తరలించారు. పోలీస్ పికెట్లు ఏర్పాటు చేశారు.