: యువ నటుడి ఓట్ల వేట
మే 5న కర్ణాటక విధానసభకు జరగనున్న ఎన్నికలకు ప్రచారం జోరుగా సాగుతోంది. అభ్యర్థులు ఎవరికి వారే విజయం కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఒక్క ఓటు కూడా ఫలితాన్ని తారుమారు చేసే అవకాశాలు ఉండడంతో కొందరు ప్రచారంపై ప్రత్యేక దృష్టి పెట్టారు.
ఈ నేపథ్యంలో ఒక నటుడికి చేతినిండా పని దొరికింది. సినిమాలలో కాదండి. ఎన్నికల ప్రచారంలో. సాధారణంగా సినీ నటులు తమకు నచ్చిన ఒక పార్టీ లేదా ఒక సన్నిహిత మిత్రుడి తరఫున ప్రచారం చేయడం మాత్రమే విన్నాం. కానీ ప్రముఖ కన్నడ యువ నటుడు దర్శన్ కు మాత్రం ఆ పార్టీ, ఈ పార్టీ అని లేదు. చేతినిండా పని, జేబు నిండా పైసలుంటే చాలు అన్నట్లు ప్రచారంలో చెలరేగిపోతున్నాడు.
కన్నడ సీనియర్ నటుడు, కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్న హీరో అంబరీష్ తరఫున మాండ్య నియోజకవర్గంలో రెండు రోజుల క్రితం దర్శన్ ముమ్మరంగా ప్రచారం చేశాడు. అంబరీష్ ను అంబారీ ఎక్కించమని ఓటర్లకు విజ్ఞప్తి చేశాడు. గురువారం కిత్తూరు నియోజకవర్గంలో జేడీఎస్ అభ్యర్థి ఆనంద్ అప్పుగోళ్ నూ గెలింపించమని ఓటర్లను ప్రాథేయపడ్డాడు. కొన్ని రోజుల్లో బెంగళూరులోని మహదేవపుర నియోజకర్గంలో బీజేపీ అభ్యర్థి అరవింద లింబావళి తరఫున కూడా ఓట్లడగనున్నాడు. "వారు నా వారు అందుకే ప్రచారం చేస్తున్నా" అని దర్శన్ అమాయకంగా బదులిచ్చాడు. అసలు విషయం వేరే ఉంటుందిలే అనుకుంటున్నారు కొందరు ఓటర్లు.