: ఉద్యోగాల పేరిట రైల్వే గార్డు భారీ మోసం... అరెస్ట్ చేసిన సీబీఐ
మహబూబ్ బాషా.. చేసేది చిన్న ఉద్యోగమే అయినా, చేతి వాటంలో మాత్రం భారీ తిమింగలమే. భారతీయ రైల్వేల్లో గార్డుగా పనిచేస్తున్న అతగాడు... రైల్వేల్లో ఉద్యోగాలిప్పిస్తానని అక్రమ వసూళ్లకు తెర తీశాడు. గుంటూరు కేంద్రంగా ఉద్యోగం వెలగబెడుతున్న అతడు తన మాయ మాటలతో భారీ సంఖ్యలోనే అయామకులను తన బుట్టలో వేసుకున్నాడు. ఒక్కొక్కరి నుంచి రూ.4 లక్షల చొప్పున వసూలు చేశాడు. ఆపై ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి... ఇదిగో, అదిగో అంటూ అతడు కాలయాపన చేశాడు. మోసపోయామని గ్రహించిన బాధితులు ఏకంగా సీబీఐ అధికారులను ఆశ్రయించారు. దీంతో రంగంలోకి దిగిన సీబీఐ అధికారులు నిన్న అతడి ఇంటిపై మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్న సీబీఐ అధికారులు అతడిని అరెస్ట్ చేశారు. నేడు అతడిని కోర్టులో హాజరుపరచనున్నారు.