: అనుమతిస్తే ఇవ్వండి, లేకుంటే లేదు... ఈ పిచ్చి నిబంధనలేంటి?: డ్యాన్స్ బార్లపై మహారాష్ట్రకు సుప్రీం చివాట్లు


మహారాష్ట్రలో డ్యాన్స్ బార్లకు అనుమతి ఇస్తున్నామంటూనే అడ్డగోలు నిబంధనలు విధించడంపై సుప్రీంకోర్టు ప్రభుత్వానికి చివాట్లు పెట్టింది. బార్లలో సీసీటీవీలు పెట్టాలని, వాటిని సమీప పోలీస్ స్టేషన్లలో లైవ్ వచ్చేలా ఏర్పాటు చేయాలని, కస్టమర్లకు కనీసం 20 మీటర్ల దూరంలో స్టేజ్ ఉండాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు విధించడాన్ని న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, శివ కీర్తి సింగ్ లు తప్పుబట్టారు. "స్టేజీ చుట్టూ తడికలు ఎందుకు పెట్టరు? రెస్టారెంట్ కు, స్టేజీకీ మధ్య గోడ కట్టాలన్న నిబంధన ఎందుకు పెట్టరు? నృత్యమన్నది ఓ కళ. దాన్ని ప్రదర్శించకూడదా?" అని ప్రశ్నించారు. ప్రభుత్వ నిబంధనలు అసంబద్ధమైనవని, ఆచరణయోగ్యం కాదని అభిప్రాయపడ్డారు. అనుమతి ఇస్తే ఇవ్వాలి, లేదంటే అనుమతి ఇవ్వబోమని చెప్పాలే తప్ప ఈ తరహా నిబంధనలు సరికాదని అన్నారు. బార్లలో సీసీటీవీ ఫుటేజ్ కనీసం 30 రోజుల పాటు స్టోర్ అయితే సరిపోతుందని, వాటితో స్టేషన్ల అనుసంధానం ఎందుకని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ కేసులో డ్యాన్స్ బార్ అసోసియేషన్ తరఫున సీనియర్ న్యాయవాది జయంత్ భూషణ్, మహారాష్ట్ర తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ పింకీ ఆనంద్ లు తమ వాదనలు వినిపించగా, కేసు తదుపరి విచారణను మార్చి 1కి వాయిదా వేస్తున్నట్టు కోర్టు తెలిపింది.

  • Loading...

More Telugu News