: భారతీయ రైల్వేల గురించి 10 ఆసక్తికర విశేషాలు!


మరికాసేపట్లో రైల్వే మంత్రి సురేష్ ప్రభు 2016-17 ఆర్థిక సంవత్సరానికిగాను రైల్వే బడ్జెట్ ను పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా భారతీయ రైల్వేలకు సంబంధించిన ఆసక్తికర వివరాలు కొన్ని మీకోసం... * ఇండియాలో అత్యంత వేగంగా నడిచే రైలు... ఢిల్లీ నుంచి భోపాల్ కు ప్రయాణించే శతాబ్ది ఎక్స్ ప్రెస్. సగటున 91 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే రైలు ఢిల్లీ, ఆగ్రా మధ్య 150 కి.మీ వేగంతో వెళుతుంది. ఇక అత్యంత నిదానంగా నడిచే రైలు నీలగిరి ఎక్స్ ప్రెస్. పర్వతాల మధ్య తిరిగే ఈ రైలు సగటు వేగం కేవలం 10 కి.మీ మాత్రమే. జాగింగ్ చేస్తూ కూడా రైలు కన్నా వేగంగా వెళ్లిపోవచ్చు. * డిబ్రూగఢ్ నుంచి కన్యాకుమారి వరకూ ప్రయాణించే వివేక్ ఎక్స్ ప్రెస్ 4,273 కి.మీ ప్రయాణిస్తుంది. ఇండియాలో అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఇదే. ఇక నాగపూర్, అజ్ని మధ్య ఉన్న 3 కి.మీ రైలు మార్గం అతి తక్కువది. * త్రివేండ్రం నుంచి నిజాముద్దీన్ ప్రయాణించే రాజధాని ఎక్స్ ప్రెస్ వడోదర నుంచి కోటా మధ్య 528 కి.మీ దూరం ఎక్కడా ఆగకుండా ప్రయాణిస్తుంది. ఇక హౌరా, అమృతసర్ ఎక్స్ ప్రెస్ 115 స్టేషన్లలో ఆగుతుంది. * శ్రీరాంపూర్, బెలాపూర్... మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఈ రెండు స్టేషన్లూ ఒకే చోట ఉంటాయి. వీటిని వేరు చేసేది ప్లాట్ ఫాం మాత్రమే. * ఇండియాలో అసలు సమయపాలన పాటించని రైలు గౌహతి - త్రివేండ్రం ఎక్స్ ప్రెస్. వాస్తవ సమయానికన్నా ఈ రైలు 10 నుంచి 12 గంటలు ఆలస్యంగా నడుస్తుంటుంది. * అరక్కోణం నుంచి రేణిగుంట మధ్య చెన్నైకి సమీపంలో ఉన్న వెంకటనరసింహరాజువారిపేట అతి పొడవైన రైల్వే స్టేషన్ పేరు కాగా, గుజరాత్ లోని ఆనంద్ వద్ద ఓడ్ పేరిట, ఒడిశాలో ఇబ్ పేరిట రెండు పొట్టి పేర్లను కలిగివున్న స్టేషన్లు ఉన్నాయి. * 1855లో తయారైన స్టీమ్ ఇంజన్ 'ఫెయిరీ క్వీన్' ఇప్పటికీ నడుస్తోంది. ప్రపంచంలోనే ఇప్పటికీ సేవలందిస్తున్న అత్యంత పురాతన రైలింజన్ ఇదే. * జమ్మూకాశ్మీర్ లోని పీర్ పంజాల్ టన్నెల్ దేశంలో అతి పెద్దది. దీని పొడవు 11.215 కిలోమీటర్లు. * రైళ్లల్లో టాయ్ లెట్లను ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని 1909లో తీసుకున్నారు. తనకు ఎదురైన ఇబ్బందిని ఓఖిల్ బాబు అనే వ్యక్తి లేఖ రూపంలో రాయగా, ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆ లేఖ ఇప్పటికీ ఉంది. * గోరఖ్ పూర్ జంక్షన్ అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాంను కలిగివుంది. దీని పొడవు 1.35 కి.మీ.

  • Loading...

More Telugu News