: కదిలిన వైకాపా... తెలుగుదేశంలో చేరికలపై అత్యవసర చర్చలు!
తెలుగుదేశం పార్టీలోకి ఐదుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ జంప్ కావడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీలో ఉండగా, ఈ పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో, ఏపీలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు అత్యవసర భేటీ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఉదయం బద్వేల్ ఎమ్మెల్యే జయరాములు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నానని ప్రకటించి వైకాపాలో మరింత కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలో వైకాపా నేతలు సమావేశమయ్యారు. విజయసాయిరెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పార్థసారధి, వంగవీటి రాధాకృష్ణ తదితరులు హాజరయ్యారు. తమ పార్టీలో చేర్చుకున్న ఎమ్మెల్యేలతో తక్షణం రాజీనామా చేయించాలని వారు టీడీపీని డిమాండ్ చేశారు. బాబుకు దమ్ముంటే ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని, తెలంగాణలో ఒకలా, ఏపీలో మరోలా ఆయన మాట్లాడుతూ నానాటికీ దిగజారిపోతున్నారని విమర్శించారు. కాగా, ఢిల్లీ పర్యటనను ముగించుకున్న అనంతరం ఈ సాయంత్రం జగన్ పులివెందులకు చేరుకోనున్నారు. అనంతరం ఆయన టీడీపీ ఆకర్ష్ పై నేతలతో ప్రత్యేక సమీక్ష జరుపుతారని తెలుస్తోంది.