: తలుపులు బార్లా... రూ. 13 వేల కోట్లు తెచ్చే విదేశీయులకు సకల సౌకర్యాలు!
ఏదైనా విదేశీ కంపెనీ ఇండియాకు కనీసం రెండు బిలియన్ డాలర్ల నిధులను పెట్టుబడిగా తెచ్చినట్లయితే, వారికి సకల సౌకర్యాలనూ కల్పించాలని మోదీ సర్కారు భావిస్తోంది. వారి దీర్ఘకాల నివాసానికి అనుమతులు, వారు తెచ్చుకునే ఉద్యోగులకు చౌక ధరల్లోనే వీసాల మంజూరు నుంచి మిగతా అన్ని రకాల అనుమతులు, గృహ నిర్మాణ రంగంలో రాయితీలు వంటి సౌకర్యాలన్నీ కల్పించాలని ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు పేరును వెల్లడించేందుకు ఇష్టపడని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. బడ్జెట్ సెషన్ అనంతరం మార్చి రెండో వారంలో ఈ మేరకు ప్రకటన వెలువడవచ్చని, మేకిన్ ఇండియాను మరింత ఆకర్షణీయం చేయడం ద్వారా విదేశీ పెట్టుబడుల స్వర్గధామంగా ఇండియాను మార్చాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని ఆయన తెలిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ చేసిన ఈ ప్రతిపాదనలను మిగతా మంత్రిత్వ శాఖలు సమీక్షిస్తున్నాయని, దీన్ని ప్రకటిస్తే, ఇండియాలో ఇదే తొలి రెసిడెన్సీ పర్మిట్ పాలసీ అవుతుందని తెలిపారు. కాగా, ప్రస్తుతం అమెరికా, కెనడా, సింగపూర్ లతో పాటు కొన్ని యూరప్ దేశాలు ఈ తరహా పాలసీలను అమలు చేస్తున్నాయి. మరింత పెట్టుబడి తెచ్చే వారికి దేశ పౌరసత్వాన్నీ అందిస్తున్నాయి. ఇండియాలో 'వర్క్ వీసా' నిబంధనలను సైతం మరింత సరళీకృతం చేయాలని భావిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. గ్లోబల్ ఇన్వెస్టర్లు, విదేశీ ఉద్యోగులతో చర్చించిన మీదట, తాజా ప్రతిపాదనలపై ముందడుగు వేయాలన్నది మోదీ అభిమతంగా తెలుస్తోంది. అంతకన్నా ముందు సెక్యూరిటీ ఏజన్సీలు, 'రా' అభిప్రాయాలను కూడా తీసుకుంటారని సమాచారం.