: నాలుగేళ్ల బాలుడికి జీవితఖైదు విధించిన ఈజిప్టు మిలటరీ కోర్టు!
ఈజిప్టులో కోర్టులు నిజానిజాలు తెలుసుకోకుండా ఎంత గుడ్డిగా శిక్షలు వేస్తాయన్న విషయాన్ని బయటి ప్రపంచానికి మరోసారి వెల్లడించిన ఘటన ఇది. ఏడాది వయసున్న చిన్నారి హత్య చేశాడన్న ఆరోపణలపై మూడేళ్లు విచారించిన ఈజిప్టు మిలటరీ కోర్టు, బాలుడికి జీవితఖైదు విధించడం ప్రజల నుంచి తీవ్ర విమర్శలకు కారణమైంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, నాలుగేళ్ల క్రితం అబ్సెంటియా ప్రాంతంలో నివసించే అహ్మద్ మన్సూర్ కొరానీ అనే బాలుడిపై హత్య, హత్యాయత్నం, ఆస్తుల విధ్వంసం, శాంతికి భంగం కలిగించడం, పోలీసు అధికారులను బెదిరించడం వంటి పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అంతకుముందు జరిగిన అల్లర్లు, హింసాకాండలో అహ్మద్ మన్సూర్ కొరానీ అనే పేరు నిందితుల జాబితాలో ఉండటంతో అధికారులు బాలుడి ఇంటికి వెళ్లి వివరాలు అడిగారు. మీరు వెతుకుతున్న పేరు ఏడాది చిన్నారిదని తండ్రి కొరానీ చెప్పినా వినలేదు. తొలుత తండ్రిని నాలుగు నెలల పాటు జైల్లో పెట్టి ఆపై అతని తప్పేమీ లేదని విడిచి పెట్టారు. బాలుడిని తీసుకెళ్లిపోయారు. ఆపై విచారణ జరుగగా, మొత్తం 117 మంది దోషులని తేల్చిన సౌత్ కైరో కోర్టు శిక్షలు వేసింది. ఈ మొత్తం ఘటనలపై బాలుడి తండ్రి మీడియా ముందుకు వచ్చి, తన కుమారుడిని తన నుంచి వేరు చేయవద్దని వేడుకున్నాడు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో, మిలటరీ అధికారులు పొరపాటున బాలుడికి శిక్ష పడిందని, చట్టాల ప్రకారం, తదుపరి అపీలులో తప్పు సవరించుకుంటామని చెప్పడం కొసమెరుపు.