: కడదాకా కాంగ్రెస్ లోనే... బీజేపీలో చేరే ప్రసక్తే లేదు: మెగాస్టార్ చిరంజీవి ప్రకటన
కాంగ్రెస్ పార్టీ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు మెగాస్టార్ చిరంజీవి... తాను పార్టీ మారుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశారు. కడదాకా కాంగ్రెస్ పార్టీతోనే తన ప్రయాణం సాగుతుందని ఆయన ప్రకటించారు. చేతికి కట్టుతోనే సతీసమేతంగా నేటి ఉదయం బయటకు వచ్చిన ఆయన హైదరాబాదు, ఫిల్మ్ నగర్ సన్నిధానంలో జరిగిన మూడు కొత్త ఆలయాల అంకురార్పణలో పాలుపంచుకున్నారు. ఆ తర్వాత అక్కడి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన చిరంజీవి వదంతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారే యోచన తనకు లేదని చిరంజీవి తేల్చిచెప్పేశారు. ఇటీవల తన సొంతూరు మొగల్తూరు, దత్తత గ్రామం పేరుపాలెంలో పర్యటించిన సందర్భంగా చిరంజీవి బీజేపీలో చేరుతున్నట్లు ప్రచారం సాగింది. ఈ మేరకు సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. దీనిపై స్పందించిన చిరంజీవి... ఇప్పటికైనా తాను పార్టీ మారుతున్నానన్న వదంతులకు ఫుల్ స్టాప్ పెట్టండి అంటూ మీడియా ప్రతినిధులను కోరారు. రాజకీయాల్లో ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానంటూ ఆయన స్పష్టం చేశారు.