: చతురత లేని జగన్... భ్రమల్లో చంద్రబాబు: హరిరామజోగయ్య సంచలన వ్యాఖ్యలు
రాజకీయల్లో సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన సీనియర్ రాజకీయ వేత్త చేగొండి హరిరామజోగయ్య నిన్న మరోమారు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొన్నటి టీడీపీ ‘ఆకర్ష్’పై నిన్న ఓ లేఖ విడుదల చేసిన జోగయ్య... వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఘాటు వ్యాఖ్యలు చేస్తూనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికి హెచ్చరికలు జారీ చేశారు. జగన్ మోహన్ రెడ్డి చేతకానితనం వల్లే ఆయన పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు, ఓ ఎమ్మెల్సీ గోడ దూకారని జోగయ్య వ్యాఖ్యానించారు. తన తండ్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిలో ఉన్న రాజకీయ చతురత, లక్షణాలు జగన్ లో లేనందువల్లే టీడీపీ ‘ఆకర్ష్’ కార్యరూపం దాల్చిందన్నారు. రాజకీయ ఎత్తుగడల్లో జగన్ కంటే చంద్రబాబుదే పైచేయిగా నిలిచిందన్నారు. అదే సమయంలో వైసీపీ నుంచి వస్తున్న వలసల కారణంగా తన పార్టీ బలపడుతోందని చంద్రబాబు భావిస్తే అది భ్రమే అవుతుందని కూడా జోగయ్య హెచ్చరించారు. పార్టీ ఫిరాయింపుల మంత్రం తెలంగాణలో అధికార పార్టీకి సత్ఫలితాలు ఇచ్చినా, ఏపీలో ఆ తరహా ఫలితాలు ఉండకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.