: కడపలో నారా లోకేశ్ పర్యటన షురూ... నేడు, రేపు జగన్ జిల్లాలోనే టీడీపీ యువనేత


టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నేడు కీలక పర్యటనకు బయలుదేరనున్నారు. విపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడప పర్యటనకు వెళుతున్న లోకేశ్ నేడు, రేపు అక్కడే ఉంటారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు చెందిన నేతలు, కార్యకర్తలతో ఆయన సుదీర్ఘ భేటీలు నిర్వహిస్తారు. నేటి మధ్యాహ్నం 3 గంటలకు కడప జిల్లాలో అడుగుపెట్టనున్న లోకేశ్... ముందుగా రాజంపేటలో కొత్తగా ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల దాకా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో భేటీ నిర్వహిస్తారు. ఆ తర్వాత జిల్లాలోని ప్రసిద్ధ అమీన్ పీర్ దర్గాకు వెళ్లనున్న ఆయన అక్కడ జరుగుతున్న ఉర్సు ఉత్సవాలకు హాజరవుతారు. రాత్రి కడపలోనే బస చేయనున్న లోకేశ్ రేపు కూడా పూర్తిగా అక్కడే ఉంటారు. తనను కలిసేందుకు వచ్చే పార్టీ నేతలు, కార్యకర్తలకు రేపంతా ఆయన అందుబాటులో ఉండనున్నారు. వైసీపీ నేత, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి టీడీపీలో చేరిన నేపథ్యంలో జరుగుతున్న లోకేశ్ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

  • Loading...

More Telugu News