: ఇక నీళ్లకూ ‘ఏటీఎం’లు!... త్వరలో హైదరాబాదులో అందుబాటులోకి!
అదేంటీ, నీళ్లకూ ఏటీఎంలా? అని ఆశ్చర్యపోకండి. దారి వెంట వెళుతున్నాం. దప్పికేసింది. ఏం చేస్తాం? జేబులో చిల్లర ఉంటే, ఓ వాటర్ ప్యాకెట్ కొంటాం! ఇంకాస్త డబ్బు ఎక్కువుంటే... ఓ రూ.20 నోటు ఇచ్చి వాటర్ బాటిల్ కొంటాం. మరి అదే లీటర్ వాటర్ రూ.1కే చేతికందితే. బాగానే ఉంటుందిగా. లీటర్ నీళ్లను... అదీ చల్లగా ఏ షాపు వాడూ అమ్మడుగా! అందుకే... వాటర్ ‘ఏటీఎం’లు వస్తున్నాయి. అసలు విషయమేంటంటే... బ్యాంకుల శాఖకు వెళ్లకుండానే మనకు నగదును అందించేందుకు ‘ఆటోమేటిక్ టెల్లర్ మెషీన్(ఏటీఎం)’ వచ్చేశాయి. ఈవేళ ఏ మూల చూసినా... ఒకటో, రెండో ఏటీఎంలు కనిపిస్తున్నాయి. ఈ ఏటీఎంల తరహాలోనే కొత్తగా ఏర్పాటు కానున్న వాటర్ ఏటీఎంలలో ఒక రూపాయి నాణెం వేసి... బాటిల్ పడితే సరి... ఆ బాటిల్ లోకి లీటరు చల్లటి, రక్షిత మంచి నీరు చేరిపోతుంది. ఈ తరహా వాటర్ ఏటీఎంల ఏర్పాటుకు సంబంధించి అధ్యయనం చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్ రెడ్డి నిన్నటి జల మండలి సమావేశంలో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఆసక్తికర కథనం రాసింది. కథనంతో పాటు వాటర్ ఏటీఎం నమూనా ఫొటోను కూడా ఆ పత్రిక ప్రచురించింది.