: కంపెనీలు వస్తున్నాయిగానీ, డబ్బు మాత్రం తేవట్లేదు!
ఇండియాలో ప్రారంభించేందుకు వస్తున్న కంపెనీల సంఖ్య పెరిగినప్పటికీ, అవి తెస్తున్న పెట్టుబడులు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. మేకిన్ ఇండియాలో భాగంగా భారత్ సాధించిన విజయాలపై కేంద్రం గణాంకాలను విడుదల చేసింది. గత సంవత్సరం మొత్తం రూ. 3.11 లక్షల కోట్ల పెట్టుబడులు పరిశ్రమల రంగానికి తరలివచ్చాయి. అంతకుముందు 2014లో వచ్చిన పెట్టుబడుల మొత్తం రూ. 4.05 లక్షల కోట్లతో పోల్చి చూస్తే, ఇది 23 శాతం తక్కువ. డీఐపీపీ (డిపార్ట్ మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్) వెల్లడించిన వివరాల ప్రకారం, భారత చరిత్రలో అత్యధికంగా 2010లో రూ. 17.36 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. ఇక వచ్చిన ప్రతిపాదనల సంఖ్యను పరిశీలిస్తే, 2014లో 1,843గా ఉన్న గణాంకాలు 2015లో 1,990కి పెరిగాయి. ఇది 8 శాతం అధికం. ఆసక్తి చూపుతున్న కంపెనీల్లో వృద్ధి 10 ఏళ్ల కనిష్ఠానికి పడిపోగా, వచ్చిన పెట్టుబడుల వృద్ధి ఏకంగా 11 ఏళ్ల కనిష్ఠానికి దిగజారిందని ఇన్వెస్టర్లలో నమ్మకాన్ని పెంచేలా భారీ పెట్టుబడులు రాలేదని అధికారులు వ్యాఖ్యానించారు. ప్రతిపాదిత పెట్టుబడుల్లో కార్యరూపం దాల్చిన మొత్తాన్ని పరిశీలిస్తే, గణాంకాలు మరింతగా కుంచించుకుపోయాయి. 2015లో గుజరాత్ రాష్ట్రానికి రూ. 64,733 కోట్ల ప్రతిపాదనలు రాగా కేవలం రూ. 5,991 కోట్ల పెట్టుబడి వచ్చింది. మహారాష్ట్రకు రూ. 33,277 కోట్ల ప్రతిపాదనలు రాగా రూ. 18,854 కోట్ల పెట్టుబడి, కర్ణాటకలో రూ. 31,668 కోట్ల ప్రతిపాదనలకు గాను రూ. 13,780 కోట్లు వచ్చాయి. సంస్కరణల అమలు ఆలస్యం, పెరుగుతున్న ద్రవ్యోల్బణం తదితరాల కారణంగా పలు కంపెనీలు ప్రతిపాదనల స్థాయిలోనే ఆగిపోయాయని డీఐపీపీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.