: 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉన్నాను, ఇంకానా?: దేశంలో చేరిక తరువాత భూమా
తన రాజకీయ జీవితంలో అత్యధిక కాలం పాటు ప్రతిపక్షంలోనే ఉన్నానని, ఇంతకాలమూ తనను నమ్ముకున్న నియోజకవర్గం ఎలాంటి అభివృద్ధీ చెందలేదని, ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తానని భూమా నాగిరెడ్డి వెల్లడించారు. 20 ఏళ్లుగా ప్రతిపక్షంలోనే ఉంటూ వచ్చానని గుర్తు చేసిన ఆయన, ఇకపై అధికార పార్టీలో ఉండటం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తనకు మంత్రి పదవి ఇస్తానన్న హామీ ఏదీ లేదని, తన రాకతో కర్నూలు జిల్లాలో టీడీపీ బలపడుతుందే తప్ప బలహీనం కాదని తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల్లో ఎవరెవరు వీడతారో తనకు తెలియదని, చంద్రబాబుతో కలసి పనిచేస్తామని అన్నారు. తనకు రాజకీయ ప్రత్యర్థులుగా ఉన్న జిల్లా నాయకులతో కలసి వెళ్లేందుకు ముఖ్యమంత్రి పలు సలహాలు ఇచ్చారని, వాటిని పాటిస్తామని భూమా తెలిపారు.