: జనవరి 14 నుంచే గృహ నిర్బంధంలో మసూద్!... అసలు విషయం చెప్పిన పాక్
పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై జరిగిన ఉగ్రవాద దాడికి సూత్రధారిగా వ్యవహరించిన జైషే మొహ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజార్ గత నెల 14 నుంచి గృహ నిర్బంధంలోనే ఉన్నాడట. పఠాన్ కోట్ పై దాడి జరిగిన వెంటనే వేగంగా స్పందించిన భారత్, దాడి వెనుక మసూద్ పాత్రకు సంబంధించిన పలు కీలక ఆధారాలను పాకిస్థాన్ కు అందజేసింది. అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ క్రమంలో పాక్ ప్రధాని అత్యున్నత దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాక మసూద్ సహా జైషే మొహ్మద్ సంస్థకు చెందిన పలువురు కీలక నేతలను అదుపులోకి తీసుకున్నామంటూ ఆ దేశం నుంచి లీకులు విడుదలయ్యాయి. అయితే నాడు దీనిపై పాక్ నోరు విప్పలేదు. మరోవైపు అసలు మసూద్ అరెస్ట్ కాలేదని కూడా పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు పాక్ వాస్తవాలను వెల్లడించింది. జనవరి 14ననే మసూద్ కు గృహ నిర్బంధం విధించామని పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సలహాదారు సర్తాజ్ అజీజ్ నిన్న ప్రకటించారు.