: శతాధిక మాతృమూర్తికి ప్రధాని పాదాభివందనం..మీరూ చూడండి!
శతాధిక మాతృమూర్తికి ప్రధాని నరేంద్ర మోదీ పాదాభివందనం చేశారు. ఛత్తీస్ గఢ్ ధామ్తరీ జిల్లాలోని కోటాభర్రీ గ్రామానికి చెందినా వృద్ధురాలు కున్వర్ బాయి వయసు 104 సంవత్సరాలు. తన మేకలను అమ్మివేసి ఇంటి ఆవరణలో రెండు మరుగుదొడ్లను నిర్మించుకుంది. ఈ సందర్భంగా జరిగిన ఒక కార్యక్రమంలో ఆమెకు శాలువా కప్పి సన్మానించిన అనంతరం కున్వర్ బాయికి మోదీ పాదాభివందనం చేశారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలోని రాజ్ నంద్ గావ్ జిల్లాలో రూర్బన్ మిషన్ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు నరేంద్ర మోదీ అక్కడికి వెళ్లారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలన్న ఉద్దేశంతో మరుగుదొడ్లు నిర్మించుకోవడం మంచి పరిణామమని, ప్రజల్లో మార్పు వస్తోందనడానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. కాగా, మారుమూల ప్రాంతంలో నివసించే కున్వర్ బాయి కి పేపర్ చదవడం, టీవీ చూడటం వంటి అలవాట్లు లేవు. కానీ, స్వచ్ఛ భారత్ గురించిన సమాచారం మాత్రం ఆమెకు చేరింది. దీంతో తన 10 మేకలను అమ్మేసి, రెండు టాయిలెట్లను తన ఇంటి ఆవరణలో నిర్మించుకుంది. అంతేకాదు, ఈ విషయంలో ఇరుగుపొరుగు వారిని కూడా చైతన్యపరుస్తోంది. రూర్బన్ మిషన్ లో భాగంగా మొదటి ఫేజ్ కింద రాజ్ నంద్ గావ్, ధామ్తరీ, బస్తర్, కబీర్ థామ్ జిల్లాల్లోని గ్రామాలను అభివృద్ధి చేయనున్నారు.