: వచ్చే ఏడాది కరవు ఉందని ఎవరూ చెప్పకూడదు: కలెక్టర్లకు చంద్రబాబు వార్నింగ్
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు జిల్లా కలెక్టర్లకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. నేటి ఉదయం విజయవాడలో ప్రారంభమైన కలెక్టర్ల సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన చంద్రబాబు... రానున్న ఏడాదిలో ప్రభుత్వ ప్రాథామ్యాలను ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన కరవు పరిస్థితులను ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రం ఆర్థిక లోటులో ఉన్నా, గణనీయ వృద్ధిని నమోదు చేయగలిగామని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ వృద్ధిని కొనసాగిస్తే... సమీప భవిష్యత్తులోనే ఆర్థిక చిక్కుల్లో నుంచి బయటపడతామని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది మాదిరిగానే జిల్లాల కలెక్టర్లు మెరుగైన పనితీరు కనబరచాలన్నారు. ఈ క్రమంలో వచ్చే ఏడాది ఏ ఒక్క జిల్లాలోనూ కరవు పరిస్థితులు ఏర్పడరాదన్నారు. ఎక్కడైనా కరవు ఉందని, ఏ ఒక్క కలెక్టర్ చెప్పినా సహించేది లేదని ఆయన హెచ్చరించారు.