: యూఎస్ అధ్యక్ష పోటీ నుంచి వైదొలగిన జార్జ్ బుష్ సోదరుడు
అమెరికా అధ్యక్ష పదవి కోసం రిపబ్లికన్ల తరఫున పోటీ పడుతున్న జెబ్ బుష్ ప్రజల మద్దతును సమీకరించుకోవడంలో విఫలమై వైదొలగారు. ఇద్దరు అధ్యక్షుల వారసత్వాన్ని కొనసాగించాలన్న ఆయన కోరిక ఇప్పటికి నెరవేరదన్నట్టే. అమెరికా మాజీ అధ్యక్షుడు హెచ్ డబ్ల్యూ బుష్ కుమారుడిగా, జార్జ్ బుష్ సోదరుడిగా ప్రజల్లోకి వచ్చిన జెబ్ బుష్ తొలుత దూకుడుగా ఉన్నప్పటికీ, డొనాల్డ్ ట్రంప్, టెడ్ క్రూజ్, మార్క్ రుబియోల వెనుకనే ఉండిపోయారు. ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉన్న ఆయన పోటీ నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించారు. జెబ్ కు మద్దతుగా జార్జ్ బుష్ సైతం రంగంలోకి దిగినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. 2003లో తన సోదరుడి హయాంలో ఇరాక్ లో సాగిన యుద్ధంపై తన వైఖరిని స్పష్టం చేయడంలో ఆయన వైఫల్యం చెందడం, ప్రజల్లోకి చొచ్చుకుపోలేకపోవడం, అన్న జార్జ్ బుష్ ఆలస్యంగా రంగంలోకి దిగడం వంటి అంశాలు ఆయనకు ప్రతికూలంగా మారాయని నిపుణులు వ్యాఖ్యానించారు.