: పోటీని చూస్తే, ఇంత భయమెందుకు?: రతన్ టాటా సూటి ప్రశ్న


దేశీయ విమానయాన రంగంలో పెరుగుతున్న పోటీని చూసి పాత కంపెనీలు భయపడుతున్నాయని టాటా గ్రూప్ గౌరవ చైర్మన్ రతన్ టాటా వ్యాఖ్యానించారు. పౌరవిమానయాన రంగంలో అమలవుతున్న '5/20' రూల్ (కనీసం ఐదేళ్ల పాటు సేవలందిస్తూ, 20 విమానాలు కలిగివుంటేనే విదేశీ సర్వీసులు నడిపే అవకాశం)ను తొలగించే దిశగా ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్న వేళ, పెద్ద పెద్ద ఎయిర్ లైన్స్ దాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని టాటా ఆరోపించారు. పెరుగుతున్న పోటీని చూసి ఎయిర్ లైన్స్ ఎందుకు భయపడుతున్నాయని ప్రశ్నించారు. టాటా సన్స్ కు 51 శాతం వాటాలున్న విస్తారా ఎయిర్ లైన్స్, 5/20 రూల్ ను తొలగించాలని, దీనివల్ల దేశ ఆర్థిక వృద్ధి మరింత వేగవంతమవుతుందని కోరుతున్న సంగతి తెలిసిందే. విస్తారా ఎయిర్ లైన్స్ విదేశీ సేవలను ప్రారంభించాలన్న తొందరలో ఉన్నప్పటికీ, నిబంధనలు అడ్డొస్తున్నాయి. కొత్త, పాత ఎయిర్ లైన్స్ మధ్య విధానాల చిచ్చు తొలగించే దిశగా మోదీ సర్కారు కసరత్తులు చేస్తుంటే, విస్తారా వంటి చిన్న విమానయాన సంస్థలు విదేశీ సర్వీసులను ప్రారంభిస్తే, తమకు నష్టాలు వస్తాయన్నది జెట్ ఎయిర్ వేస్, స్పైస్ జెట్, ఎయిర్ ఇండియా వంటి సంస్థల ఆరోపణ. కాగా, మోదీ సర్కారు రతన్ టాటాకు మేలు చేయాలని భావిస్తోందన్న ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. తాజాగా స్పైస్ జెట్ చైర్మన్ అజయ్ సింగ్, టాటాను ఉద్దేశించి ఘాటు లేఖ రాశారు. భారత చట్టాలను, విమానయాన నిబంధనలనూ పాటించాలని ఆయనకు హితవు పలికారు. విదేశీ కంపెనీల వాటాలు ఉన్నందునే విస్తారా వంటి సంస్థలు భారత చట్టాలను, నిబంధనలను సవరింప చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు. మరోవైపు ఇండిగో, స్పైస్ జెట్, జెట్ ఎయిర్ వేస్ సంస్థల ఉన్నతాధికారులూ 5/20 నిబంధన తొలగింపును వ్యతిరేకిస్తున్నారు.

  • Loading...

More Telugu News