: కొట్టి చంపేస్తారనే పారిపోయాం... పోలీసులకు భయపడలేదు: ఖలీద్ అండ్ బ్యాచ్ వెల్లడి


పార్లమెంటుపై జరిగిన దాడి కేసులో అఫ్జల్ గురు ఉరిశిక్షను నిరసిస్తూ ర్యాలీ తీయడమే కాక ర్యాలీలో దేశానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశారన్న కారణంగా ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయానికి చెందిన ఆరుగురు విద్యార్థులపై రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ క్రమంలో వర్సిటీ విద్యార్థి సంఘం నేత కన్నయ్య కుమార్ అరెస్ట్ కాగానే మిగిలిన ఐదుగురు విద్యార్థులు ఈ నెల 12 న అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. వీరిలో ఉమర్ ఖలీద్ తో పాటు అనిర్బన్ భట్టాచార్య, రామ నాగ, అశుతోశ్ కుమార్, అనంత్ ప్రకాశ్ ఉన్నారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత వర్సిటీలో ప్రత్యక్షమైన వీరు... తాము ఎందుకు పారిపోవాల్సి వచ్చిందన్న విషయాన్ని వెల్లడిస్తూ సంచలన విషయాలను చెప్పారు. ఈ కేసులో జరుగుతున్న దర్యాప్తునకు సహకరించేందుకే తాము తిరిగివచ్చామని అశుతోశ్ కుమార్ చెప్పాడు. పారిపోవడానికి కారణాలను వివరించిన సందర్భంగా అతడి ముఖంలో తీవ్ర భయాందోళనలు కనిపించాయి. ర్యాలీలో తీసిన వీడియోగా చెబుతున్న వీడియో అసలుది కాదని అతడు ఆరోపించాడు. కృత్రిమంగా తయారు చేసిన సదరు వీడియోను చూసిన విద్యార్థులు ఎక్కడ తమను కొట్టి చంపేస్తారోనన్న భయంతోనే పారిపోయామని అతడు పేర్కొన్నాడు. అయితే పోలీసు కేసులకు తాము ఏమాత్రం భయపడలేదని అతడు పేర్కొనడం గమనార్హం.

  • Loading...

More Telugu News