: నా ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతోంది!: మోదీ సంచలన వ్యాఖ్యలు
కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు, తన పరువు, ప్రతిష్ఠలను దిగజార్చేందుకు కొందరు అనుక్షణం ప్రయత్నిస్తున్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. వారి ఆటలు సాగడం లేదని తనపై బురద జల్లుతున్నారని ఆయన ఆరోపించారు. అయితే, ఎట్టి పరిస్థితుల్లోను అభివృద్ధి పథాన్ని వీడబోనని, వీరి ఆరోపణలకు భయపడేది లేదని అన్నారు. ఒడిశాలోని బరగఢ్ లో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన, ఓ చాయ్ వాలా ఇండియాకు ప్రధానమంత్రి అయ్యారన్న నిజాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారని, ఈ మధ్యకాలంలో తనపై జరుగుతున్న కుట్ర, ఆరోపణల వర్షం కురిపించడం తదితరాలను ప్రజలంతా చూస్తున్నారని అన్నారు. దేశాన్ని దోచుకోవడానికి అవకాశం లభించడం లేదన్న బాధతోనే తనను లక్ష్యంగా చేసుకుంటున్నారని అన్నారు. వచ్చే ఆరేళ్లలో రైతుల ఆదాయం రెండింతలు చేస్తానని, స్టార్టప్ పరిశ్రమలు వ్యవసాయం అభివృద్ధికి ఉపయోగపడతాయని అన్నారు. కాగా, నేడు మోదీ తన సొంత నియోజకవర్గం వారణాసిలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు.