: దూకుడు పెంచిన ‘గులాబీ’ దండు... అచ్చంపేట మునిసిపాలిటీలోనూ మోగిన నగారా!


గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ కార్పొరేషన్ లో లభించిన అఖండ విజయం ‘గులాబీ’ దండుకు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మూడో రోజే వరంగల్ కార్పొరేషన్ లో కాలుపెట్టిన తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు... అక్కడి వాస్తవ స్థితిగతులను పరిశీలించారు. ఆ వెంటనే ఆయన ఖమ్మం కార్పొరేషన్ పరిస్థితిపైనా ఆరా తీశారు. ఇక వెనుకబడ్డ పాలమూరు జిల్లాలోని అచ్చంపేట మునిసిపాలిటీలో పరిస్థితిపై సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్... వాటిలో ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితం గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్, ఖమ్మం కార్పొరేషన్లకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ విడుదలైపోయింది. ఆ వెనువెంటనే అచ్చంపేట మునిసిపాలిటీకీ కూడా ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ లలో మాదిరిగానే అచ్చంపేటలోనూ రేపటి నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈ నెల 24 వరకు నామినేషన్లను స్వీకరించే అధికార యంత్రాంగం 25న నామినేషన్ల పరిశీలనను చేపడుతుంది. 26 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు. ఇక కీలక ఘట్టమైన పోలింగ్ ను మార్చి 6న నిర్వహించనున్న రాష్ట్ర ఎన్నికల సంఘం 9న ఓట్ల లెక్కింపును చేపట్టనుంది.

  • Loading...

More Telugu News