: నడిరోడ్డుపై పులి... అరగంట పాటు భయం భయంగా మేడారం భక్తులు
వరంగల్ జిల్లా మేడారంలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతరకు వెళ్లి తిరుగుపయనమైన భక్తులు.. నడిరోడ్డుపై తమకు అడ్డంగా నిలిచిన పులిని చూసి దాదాపు అరగంటపాటు బిక్కుబిక్కుమంటూ గడిపారు. మేడారం భక్తులతో తిరుగుపయమైన ఓ బస్సుకు ఆదిలాబాదు జిల్లా జన్నారం మండలంలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధి పైడిపల్లి అటవీ ప్రాంతంలో శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ఓ పులి అడ్డంగా నిలిచింది. బస్సు లైట్ల వెలుతురుకు ఏమాత్రం బెదరని పులి... నడిరోడ్డుపైనే అరగంటకు పైగా కూర్చుండిపోయింది. దీంతో పులి లేచి వెళ్లేదాకా బస్సు అక్కడే నిలిచిపోగా, బస్సులోని భక్తులు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీశారు. ఇక బస్సు వచ్చిన దారిలోనే ఓ ముగ్గురు యువకులు బైక్ పై అక్కడికి వచ్చి పులిని చూసి బస్సు వెనకే బైకును నిలిపేశారు. ఆ తర్వాత దాదాపు అరగంట పాటు అక్కడే కూర్చుండిపోయిన పులి ఆ తర్వాత అక్కడి నుంచి కదలడంతో బతుకు జీవుడా అంటూ బస్సు బయలుదేరింది.