: కేబీఆర్ పార్కు వద్ద పల్టీ కొట్టిన కారు... ఐదుగురు యువతులకు గాయాలు
భాగ్యనగరి హైదరాబాదులో ర్యాష్ డ్రైవింగ్ కు అడ్డుకట్ట పడటం లేదు. నున్నటి రోడ్లపై వేగ పరిమితి లేకుండా దూసుకెళుతూ యువత హల్ చల్ చేస్తోంది. ఈ క్రమంలో పెను ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ తరహాలోనే నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత హైదరాబాదులో పెద్ద ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం పెద్దదే అయినా, నష్టం మాత్రం స్వల్పంగానే జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. నగరంలోని బంజారాహిల్స్ పరిధిలోని కేబీఆర్ పార్కు సమీపంలో నడిరోడ్డుపై వేగంగా వెళుతున్న ఓ కారు అదుపు తప్పి కన్ను మూసి తెరిచేలోగా డివైడర్ పైకి దూసుకెళ్లింది. ఆ తర్వాత రోడ్డుపైనే పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు స్వల్పంగా దెబ్బతిన్నది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురు యువతులకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సదరు యువతులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రమాదంలో గాయపడ్డ యువతులు ఎవరనే విషయం మాత్రం వెల్లడి కాలేదు.