: నాన్న జీవిత కథ చదివేందుకు చాలా భయపడ్డాను: సోనాక్షి సిన్హా
తన తండ్రి జీవిత కథను చదివేందుకు చాలా భయపడ్డానని బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తెలిపింది. నిన్న ముంబైలో అలనాటి నటుడు, బీజేపీ ఎంపీ శత్రుఘ్నసిన్హా జీవిత చరిత్ర 'ఎనీ థింగ్ బట్ ఖామోష్: ద శత్రుఘ్నసిన్హా బయోగ్రఫీ' పుస్తకాన్ని ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సోనాక్షి మాట్లాడుతూ, తల్లిదండ్రుల జీవితాల్లోని కొన్ని విషయాలు పిల్లలకు తెలియకపోవడమే మంచిదని అభిప్రాయపడింది. అందుకే ఈ పుస్తకం చదివేందుకు చాలా భయపడ్డానని తెలిపింది. అయితే తన తండ్రి బాల్యం, యవ్వనం ప్రారంభం, కాలేజీ రోజుల వరకు చదివానని, ఆయన నటుడు అయిన తరువాతి అధ్యాయాలను చదవలేదని తెలిపింది. పోతే, శత్రుఘ్న సిన్హా సినిమాల్లోకి వచ్చిన తరువాత రీనారాయ్ తో సాగించిన ప్రేమాయణం, తరువాత పూనంను వివాహం చేసుకున్న అనంతరం ఆమెతో కొనసాగించిన అనుబంధం గురించి కూడా ఈ పుస్తకంలో ప్రస్తావించినట్టు తెలుస్తోంది.