: రణరంగంలా హర్యానా... 3 పాఠశాలలకు నిప్పు!
రిజర్వేషన్ల కోసం జాట్లు చేపట్టిన నిరసన ప్రదర్శనలు మరింత తీవ్ర రూపం దాల్చాయి. ఈ ఉదయం జింద్ జిల్లాలోని బుద్ధా ఖేర్ రైల్వే స్టేషన్ కు నిప్పు పెట్టిన నిరసన కారులు అక్కడి ఫర్నీచర్ ను ధ్వంసం చేశారు. రోహ్ తక్ జిల్లా వ్యాప్తంగా నిరసనల జోరు పెరిగింది. గుహానా రోడ్ లోని మూడు పాఠశాలలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పంటించారు. ఇక్కడి పెట్రోలు బంక్ లు, కమ్యూనిటీ హాళ్లు, దుకాణాలను కూడా ఆందోళనకారులు అగ్నికి ఆహుతి చేశారు. కలనోర్ లో బీడీవో కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఈ ప్రాంతంలో పలు బస్సులనూ దహనం చేశారు. హర్యానా రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించగా, ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంతో పాటు పలు కాలేజీల్లో చదువుతున్న జాట్ విద్యార్థులు రహదార్లపై నిరసన ప్రదర్శనలకు దిగారు. జింద్ జిల్లాలోని 30 ప్రాంతాల్లో రహదారులపై ఏ ఒక్క వాహనమూ కదిలే పరిస్థితి లేదని తెలుస్తోంది. ఢిల్లీ-సోనిపట్ మార్గం పూర్తిగా మూసుకుపోగా, హర్యానా నుంచి రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.